న్యూఢిల్లీ: కోవిడ్-19 సంక్షోభం పెద్ద సవాల్ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తితో తలెత్తిన పరిస్థితులను అవకాశంగా తీసుకుని సంక్షోభాలను ఎదుర్కొనేందుకు వినూత్న ఆవిష్కరణలకు నాంది పలకాలని అభిప్రాయపడ్డారు. ‘కోవిడ్-19 మహమ్మారి పెద్ద సవాల్. ఈ సంక్షోభ సమయంలో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, డేటా నిపుణులను పెద్ద ఎత్తున సమీకరించి వినూత్న పరిష్కారాలు కనుక్కోవాల్సిన అవసరం ఉంద’ని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
కోవిడ్‌పై ఐక్యంగా పోరాడాలని అంతకుముందు రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో లాక్‌డౌన్‌ని వ్యూహాత్మకంగా ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. కేవలం లాక్‌డౌన్‌తోనే కరోనాకు చెక్ పెట్టలేమని, విస్తృతంగా కోవిడ్ పరీక్షలు నిర్వహించడమొక్కటే ప్రధాన ఆయుధమనీ ఆయన పేర్కొన్నారు. లాక్‌డౌన్ కారణంగా కష్టాలు పడుతున్న వలస కార్మికులను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమస్యను పాలకులు వెంటనే పరిష్కరించకుంటే సామాజిక అస్థిరతకు దారితీసే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ గడువును మే3 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.